నందమూరి అభిమానులు ఎన్టీఆర్ తరువాత చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఈ ఏడాది నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి భారీ హిట్స్ ఇచ్చిన ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఏ దర్శకుడితో చేయనున్నాడనే విషయం కొద్ది కాలం నుండి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయంపై నందమూరి కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ 27వ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తన నిర్మాణంలోనే తెరకెక్కనుందంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని పవర్, సర్ధార్ గబ్బర్ సింగ్ లాంటి భారీ చిత్రాలు తెరకెక్కించిన బాబీ తెరకెక్కించనున్నట్టు తెలిపాడు.
కళ్యాణ్ రామ్ ఇచ్చిన క్లారిటీతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్న నిర్మాణంలో తమ్మడు చేయబోవు సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేయనుందని వారు అంటున్నారు. తన ప్రతి సినిమాలోను కొత్త లుక్ ట్రై చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలోను సరికొత్తగా కనిపించనున్నారట. జనవరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు సమాచారం. దీనికోసం ఇప్పటికే తారక్ మేకోవర్ అవుతుండగా, ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ అప్పుల నుంచి గట్టెక్కొచ్చు అంటున్నారు సినీ పెద్దలు.