Idea,Airtel, లో 999, 888, 777, 666 వంటి నెంబర్ల నుండి కాల్స్ వస్తే వాటిని ఎత్తితే జనాలు చనిపోతున్నారట.. ఈ మధ్య Whatsappలో విపరీతంగా ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది.
పాపం అమాయకులు వాటిని కనీసం ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేస్తున్నారు.
పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే… ఎవడు క్రియేట్ చేశాడో గానీ కనీసం వాడికి బుర్ర అనేది ఉందో కూడా అర్థం కావట్లేదు. Airtel గానీ, Idea గానీ ఓ ఫోన్ నెంబర్ క్రియేట్ చేసిందీ అంటే.. అది మామూలు టెలి ఫోన్ నెట్‌వర్క్ ద్వారా కాల్స్ రావడం జరుగుతుంది కానీ ఏ నరకం నుండో కాల్స్ రావు.
అసలు కామెడీ కాకపోతే ఓ కాల్ వస్తే మనిషి చనిపోవడం ఏంటి? కాస్తయినా అర్థముండాలి కదా? ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఎగబడి కొందరు ఈ పనికి మాలిన మెసేజ్‌లు Whatsappలో తమ ఫ్రెండ్స్‌కీ, ఇతర Whatsapp Groupలకూ షేర్ చేస్తున్నారు. దీన్ని అమాయకత్వం అనాలా, బాధ్యతా రాహిత్యం అనాలా?
ఇలాంటి వాళ్ల అమాయకత్వాన్ని చూసే చాలా మంది చెవులో పూలు పెడుతూ రకరకాల పనికి మాలిన భయపెట్టే మెసేజ్‌లు తయారు చేసి శాడిస్టిక్‌గా బిహేవ్ చేస్తుంటే.. జనాలు వీటిని సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకడు ఫోన్ బ్యాటరీ చుట్టూ ఏదో లేయర్ ఉంటుంది.. అది వెంటనే పీకేయండి, లేదంటే మీ డేటా కాపీ అవుతుంది.. అంటూ అపర మేధావిలా జనాల్ని భయ పెడతాడు, మరొకడు Reliance Jio సిమ్ వేసిన ఫోన్లో మరో సిమ్ వేసుకోవడానికి వీలు పడదు అని జనాల్ని టెన్షన్‌లో పెడతాడు..
ఇంకొకడు మరింత క్రియేటివ్‌గా ఆలోచించి.. “ఫలానా నెంబర్ల నుండి కాల్స్ వస్తే ఫోన్లు పేలిపోతున్నాంటాడు” – ఇలాంటి మెంటల్ వాళ్లని ఏం చేసినా పాపం లేదు.
ఇవన్నీ చూస్తుంటే మన దేశం, మన ప్రజలు కనీస విషయాల పట్ల అవగాహన పెంచుకోపోతే మున్ముందు ప్రతీ చిన్న విషయానికీ భయపడుతూ.. ఇలాంటి అవాస్తవాలను షేర్ చేసుకుంటూ మానసికంగా చాలా సఫర్ అవుతారు అన్పిస్తోంది.