జియో వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆఫర్లను రిలయన్స్ జియో అధినేత ముకేష్ అంబానీ ఎట్టకేలకు ప్రటించేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముకేష్ అంబానీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జియో ఉచిత సర్వీసులను మార్చి 31వరకు ఉచితంగా అందిస్తామని ప్రకటిస్తూ దీనికి ‘జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్’గా నామకరణం చేశారు. ‘‘కాగిత రహిత సమాజం కోసమే జియో తీసుకొచ్చాం. జియో సిమ్‌లను హోమ్ డెలివరీ చేస్తున్నాం. సిమ్ తీసుకున్న 5 నిమిషాల్లో యాక్టివేట్ అవుతుంది. జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌తో కస్టమర్లకు ఉచిత సేవలు అందిస్తాం. ఈ ఆఫర్ కింద అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్, వీడియో, వైఫై, జియో యాప్స్‌ను మార్చి 31వరకు ఉచితంగా అందిస్తాం.’’ అని ముకేష్ తెలిపారు.
జియో వినియోగదారులకు ఇతర నెట్‌వర్క్‌లు సహకరించట్లేదని, అయినా ఐదు కోట్ల మంది ప్రజలు జియోను వాడుతున్నారని ముకేష్ అంబానీ అన్నారు. డిసెంబర్ 31 తర్వాత 100 నగరాల్లో మై జియో అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొస్తామని ముకేష్ అంబానీ పేర్కొన్నారు.